Thursday, July 21, 2011

తెలుగులో కొత్త మాటలు అనువాదాలేనా?!! అనువాద వాదాలు

 

నండూరి  రామమోహన్ రావు గారి అనువాద శైలి  చాలా బాగుంటుంది అనేవారు ఆంధ్ర పత్రిక శివలెంక రాధాకృష్ణ గారు. మొదటిసారిగా ఒక ఆంగ్ల వ్యాసం నాకు ఇచ్చి అనువాదం చేయమన్నారు. అనువాదం చేయాల్సిన దానిని పూర్తిగా చదివి , దానిని తెలుగులో మరెవరికయినా చెపుతున్నట్టుగా  వ్రాయమన్నారు . ప్రతి వాక్యం అనువాదం చెయ్యనక్కరలేదు , విషయాలు వదలిపెట్టకుండా చూసుకుంటే చాలు అన్నారు. ఇదే పద్దతిలో చాలా అనువాదాలు అయన నాకు అప్పగించగా  చేశాను. అలాగే ఓ ఇంగ్లిష్ నవలని అనువాదం చేసి ఇచ్చాను. 48 వారాలపాటు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో  ప్రచురించారు.  

కప్పగంతు శివరాం ప్రసాద్ గారు  (సాహిత్య-అభిమాని బ్లాగ్)ఈ మధ్య ఆంగ్ల  పదాలకు  అనువాదపు  వాదాల గురించి  చెప్పారు. తెలుగు పదాల సరళత గురించి ప్రకటన   ముద్ర  నా బ్లాగ్లో   కూడా వేస్తామన్నారు. అయన  అభిప్రాయాలతో ఏకీభవిస్తూ. సరే అన్నాను. 

ఆల్ ఇండియా రేడియో  ఆంటే ఆకాశవాణి గా అన్ని భారతీయ భాషలలోను చెలామణి అవుతోంది (తమిళ నాడులో మాత్రం - "వాణీ నిలయం"-ట --ఈ వివరాలు శ్రీ  మంగళగిరి  ఆదిత్య ప్రసాద్ గారు, డైరెక్టర్ , ఆకాశ వాణి,  విజయవాడ కేంద్రం --- , అడగ్గా  చెప్పారు). 


టెలివిషన్  ఆంటే దూరదర్శన్ గా పేరు తెచ్చుకుంది. నిజానికి ఇవి రెండూ  అనువాదాలు కావు. ఇంగ్లిష్ వస్తువులకు సరళమయిన   తెలుగు పదాలు. ఎయిర్ ప్లేయిన్ ని విమానం  అని  చక్కగా వాడుకుంటున్నాము కదా! (ఆంగ్లంలో ఎయిర్ ని అనుసరించి గాలి అనే మాట తెలుగులో వాడలేదే) "రైల్ " ని  ధూమ శకటం అని గ్రాంధికంలో కాకుండా పొగ బండి అనొచ్చు ., ఎడ్లబండి లా. ఇప్పుడు పొగ పోయింది కాబట్టి పట్టాల బండి అనవచ్చు. 

ఈరోజు దిన పత్రికలో చదివాను. స్కూల్ యూనిఫారం  బదులుగా ఏకరూప దుస్తులు అని వ్రాశారు. ఇది  అనువాదపు మాటేకాని,  సరైన తెలుగు పదమా!!     పాఠశాల  దుస్తులు  అని రాయవచ్చు. మరింత   సరళంగా  బడి బట్టలు  అనవచ్చు కదా. ఏం, మడి బట్టలు, తడి బట్టలు, ఇస్త్రి బట్టలు , బట్టలు ఆరేయటం, బట్టలు సర్దటం ...ఇలా మనం  అనటం లేదా?    

ఇప్పుడు మనం చేయాల్సింది ఇంగ్లిష్ వస్తువులను మక్కికి మక్కి  అనువాదం చేయకుండా , ఆ వస్తువు  గుణాన్ని అర్ధం చేసుకుని సరళమయిన   తెలుగు పదం గా  చేయడం. అది  కుదరనప్పుడు, కుదిరేదాకా ఇంగ్లీష్ పదాన్ని అలాగే వాడేయటం చేయాలి. కంప్యూటర్ ని  గణనిధి , ఇంటర్ నెట్  ని లోక దర్శిని , ఇ-మెయిల్  ని  ఉత్తరంగాలు అనకూడదా, ఆలోచించండి!
                         
***


7 comments:

Indian Minerva said...

"ఇప్పుడు మనం చేయాల్సింది ఇంగ్లిష్ వస్తువులను మక్కికి మక్కి అనువాదం చేయకుండా , ఆ వస్తువు గుణాన్ని అర్ధం చేసుకుని సరళమయిన తెలుగు పదం గా చేయడం. అది కుదరనప్పుడు, కుదిరేదాకా ఇంగ్లీష్ పదాన్ని అలాగే వాడేయటం చేయాలి."

అంగీకరిస్తున్నాను

Saahitya Abhimaani said...

కాప్షన్ ఒక్క మాట కూడా లేకుండా, బొమ్మల హావ భావాలతో, చెప్పదలుచుకున్న విషయం అద్భుతంగా చెప్పారు "బాబు" గారూ.

హాట్స్ ఆఫ్ (ఈ మాటకు తెలుగు ఏమిటో కదా! ఒత్తరీయాలు ఎగరేయ్యటమా?!)

కొత్త పాళీ said...

well said.
కొన్ని ప్రయోగాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని కొత్తపదాల సృష్టి ఆపకూడదు. కొత్తపదాల ద్వారా భాషకి ఆ మేరకి పుష్టి కలుగుతుంది. చివరికి జనాదరణ పొందినవే స్థిరపడతాయి ఎలాగానూ.

జేబి - JB said...

హహ్హహా! ఎంత చక్కగా చురక వేశారండి! కార్టూన్లకున్న బలమది.

కంప్యూటర్ ఎరా పత్రిక లంకె ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

మీరు ప్రతిపాదించిన పదాలు బాగున్నాయి.

బాబు said...

శివ గారు,
హట్స్ ఆఫ్ అంటే - తలపాగా తీశా! (హా..హా..)అందామా!

నిజమే, చివరకు నలుగురికి నచ్చేవే స్థిరపడతాయి.

Saahitya Abhimaani said...

@"బాబు" గారూ,

ఇంగ్లీషు వాళ్ళు ఇప్పటికీ టోపీ పెట్టుకుంటున్నారు. కారణం వాళ్ళ వాతావరణ పరిస్థితికి అది అత్యవసరం కాబట్టి. ఎవరన్నా తెలిసినవారు కనిపిస్తే ఆ టోపీనీ తీసి పలకరించటం ఒక మర్యాదగా వచ్చింది కాబట్టి "హాట్స్ ఆఫ్" అనే మాట వాళ్ళ భాషలో పుట్టింది. అది తెలుగు చెయ్యాలన్న తపనతో ఏదో ఒక మాట పుట్టిస్తే అది మనకు నప్పుదు. ఎందుకు అంటే అటువంటి ఆచారం మనకు లేదు కాబట్టి. మనం టోపీలు పెట్టుకొం, తలపాగాలు పోయి కొని దశాబ్దాలు అయిపోయింది. ఉత్తరీయాలు దాదాపుగా కనుమరుగు అవుతున్నాయి. పోనీ తలపాగాలూ, ఉత్తరీయాలు ఉన్నా కూడా అవి తియ్యటం, ఎగరేయ్యటం మన ఆచారం కాదు కదా! కాబట్టి హాట్స్ ఆఫ్ అనే ఆంగ్ల పదానికి అనువాదం కాకుండా సమానార్ధం వచ్చేది తీసుకురాగాలగాలి. అప్పుడే అది వాడుకలోకి వస్తుంది.

@కొత్త పాళీ గారూ,

మీరు అన్నట్టుగా కొన్ని పద ప్రయోగాలు ఎబ్బెట్టుగానే కాదు నా ఉద్దేశ్యంలో వికృతంగా కూడా ఉంటున్నాయి. కారణం అదే ఒక పనిగా పెట్టుకుని తెలుగులో పదాలను తయారు చెయ్యాలన్న తొందర. పదాలు వాడుకలోంచి వస్తాయి అన్న విషయం మరచి, హడావిడి పడిపోయి మనం ఒక పదం తయారు చెయ్యకపోతే భాష ఏమైపోతుందో అని బెంగ పెట్టుకుని, గ్రాధికం లోకి వెళ్ళిపోయి పద సృష్టి చెయ్యటం వల్ల భాషకు ఒరిగేది ఏమీ లేదు. నలుగురూ వాడుకోగాలిగిన సులువైన పదాలను సూచించే ప్రయత్నం చేస్తే ఎంతైనా బాగుంటుంది

బాబు said...

శివ గారు,
తలపాగా తీయడం అంటే తలవంచడం. అది తమాషా అనువాదం. హాట్స్ ఆఫ్ కు భళీ లేదా భలే అనవచ్చు.